ఛార్జీల పెంపుతో కస్టమర్లకు షాక్ ఇచ్చిన ICICI బ్యాంక్!
ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన డెబిట్ కార్డు వినియోగదారులపై ఛార్జీల భారం పెంచింది.
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన డెబిట్ కార్డు వినియోగదారులపై ఛార్జీల భారం పెంచింది. బ్యాంక్ డెబిట్ కార్డులపై వార్షిక రుసుములను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగష్టు 21 నుంచే పెంచిన ఛార్జీలు అమలవుతాయని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతకుముందు ఆగష్టు 1 నుంచి బ్యాంకు కొత్త డెబిట్ కార్డులపై జాయినింగ్ ఫీజులను పెంచిన సంగతి తెలిసిందే.
బ్యాంకు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఐసీఐసీఐ బిజినెస్ ఎక్స్‌ప్రెషన్స్ డెబిట్ కార్డుపై వార్షిక రుసుమును రూ. 499 నుంచి రూ. 599 కి పెంచింది. బిజినెస్ ఎక్స్‌ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డుపై వార్షిక ఫీజును రూ. 799 నుంచి రూ. 899 కి చేర్చింది. రూబిక్స్ డెబిట్ కార్డుపై వార్షిక ఫీజును రూ. 350 పెంచి రూ. 749 నుంచి రూ. 1,099కి సవరిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అలాగే, బిజినెస్ సఫైరో డెబిట్ కార్డు ఫీజును రూ. 1,499 నుంచి రూ. 1,999కి పెంచింది.