7 నిమిషాల సమావేశంలో లేఆఫ్.. షాక్‌లో IBM ఉద్యోగులు

ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి

Update: 2024-03-14 08:07 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. కృత్రిమ మేధ కారణంగా ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోగా తాజాగా దిగ్గజ కంపెనీ ఐబీఎం కూడా తమ సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ లేఆఫ్ గురించిన విషయాన్ని కేవలం 7 నిమిషాల సమావేశంలో ప్రకటించారు. ఇటీవల ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్ కేవలం ఏడు నిమిషాల సమావేశంలో సంస్థకు చెందినటువంటి మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఎంతమందిని తొలగించారనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.

రానున్న సంవత్సరాల్లో ఉద్యోగుల స్థానాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నట్లు గతంలో కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ పేర్కొనగా ఇప్పుడు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐబీఎం రానున్న ఐదేళ్ల కాలంలో 30 శాతం ఉద్యోగుల స్థానాలను AI ద్వారా భర్తీ చేస్తామని ఇంతకుముందు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే దిగ్గజ సంస్థలు లేఆఫ్ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇది సంవత్సరం చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు గతంలో ప్రకటించారు. నివేదిక ప్రకారం,2024లో ఐబీఎంతో సహా దాదాపు 204 కంపెనీలు 49,978 మంది ఉద్యోగులను తొలగించాయి.


Similar News