ఎవర్‌గ్రాండ్‌ను మూసేయాలని హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు
సరైన ప్రతిపాదనలతో పునర్‌వ్యవస్థీకరణ జరగకపోవడం, పురోగతి లేకపోవడంతో ఎవర్‌గ్రాండ్ తన వ్యాపారాన్ని మూసేయడమే సరైన నిర్ణయమని
దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్ దివాలా కేసులో హాంకాంగ్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణదాతలతో పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందానికి సంబంధించిన వ్యవహారంలో విఫలమైన కారణంగా ఎవర్‌గ్రాండ్‌ను లిక్విడేట్ చేయాలని సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. వ్యాపారాన్ని మూసివేసి ఆస్తులను విక్రయించి రుణాలు చెల్లించడాన్నే లిక్విడేట్ అంటారు. సరైన ప్రతిపాదనలతో ఈ పునర్‌వ్యవస్థీకరణ జరగకపోవడం, తదుపరి ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఎవర్‌గ్రాండ్ తన వ్యాపారాన్ని మూసేయడమే సరైన నిర్ణయమని హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా చాన్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆస్తులను కలిగిన ఎవర్‌గ్రాండ్ సంస్థకు అప్పులు కూడా అంతే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ నాటికి సంస్థ అప్పులు ఏకంగా 300 బిలియన్ డాలర్లకు పైగా నమోదయ్యాయి. ఇది మన కరెన్సీలో లెక్కిస్తే రూ. 25 లక్షల కోట్లు. చైనాలో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలే ఎవర్‌గ్రాండ్ సంస్థ దివాలాకు దారీతీశాయి. కష్టాల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో 2023, సెప్టెంబర్‌లో సంస్థ దివాలా కోసం దాఖలు చేసింది. సోమవారం హాంకాంగ్ కోర్టు తీర్పుతో ఎవర్‌గ్రాండ్ షేర్లు ఒక్కరోజే 20.8 శాతం కుప్పకూలాయి.