అధిక వడ్డీతో రెండు ప్రత్యేక ఎఫ్‌డీలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!
సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ అమలవుతుంది
పూణె: ప్రైవేట్ రంగ దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారుల కోసం పరిమిత కాలానికి రెండు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లను సోమవారం ప్రారంభించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు పరిమిత కాలానికి మాత్రమే ఉంటాయని, సోమవారం(మే 29) నుంచే అమల్లోకి రానున్నాయి. అందులో 35 నెలల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 7.20 శాతం అధిక వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. అలాగే, 55 నెలల కాలానికి చేసే డీఅజిట్లపై 7.25 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది. ఇదే సమయంలో బ్యాంకు ఇతర ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను కూడా సవరించింది. ఏడాది నుంచి 15 నెలల మధ్య కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ ఇస్తామని బ్యాంకు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ అమలవుతుంది. అదేవిధంగా 21 నెలల నుంచి 2 ఏళ్ల కాలానికి 7 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. మిగిలిన కాలవ్యవధులకు సంబంధించి 7-29 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం, 30-45 రోజులకు 3.50 శాతం, 46 రోజుల నుంచి ఆరు నెలల డిపాజిట్లపై 4.50 శాతం, 6-9 నెలల డిపాజిట్లపై 5.75 శాతం, 9 నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది.