Vodafone Idea షేర్ ధర రూ. 10 దాటితే.. వాటా ప్రభుత్వ సొంతం!
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇటీవల స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి వడ్డీకి బదులుగా కంపెనీ వాటాను..Latest Telugu News
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇటీవల స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి వడ్డీకి బదులుగా కంపెనీ వాటాను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, సంబంధిత వర్గాల ప్రకారం, వొడాఫోన్ ఐడియా షేర్ ధర రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిల వద్ద ట్రేడయినప్పుడే ప్రభుత్వం కంపెనీ వాటాను స్వాధీనం చేసుకోనున్నట్టు సమాచారం.
వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) బోర్డు కూడా ఒక్కో షేరుపై రూ.10 సమాన విలువతో ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. సెబీ నిబంధనలను అనుసరించి ఫేస్ వాల్యూ వద్ద ఉన్నప్పుడే వాటాలను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి VIL షేర్ ధర రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలకు చేరినప్పుడు ప్రభుత్వం వాటాలను తీసుకునే ప్రక్రియను టెలికాం శాఖ ప్రారంభిస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో వీఐఎల్ బోర్డు వాటాలను అప్పగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి కంపెనీ షేర్ ధర రూ. 10 కంటే తక్కువగానే కొనసాగుతోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో రూ. 9.68 వద్ద ఉంది. కాగా, స్పెక్ట్రమ్ వాయిదాలతో పాటు ఏజీఆర్ బకాయిలపై వడ్డీ కట్టడానికి బదులుగా కంపెనీ ఈక్విటీ వాటా ఇచ్చేందుకు వీఐఎల్ నిర్ణయించింది.
దీని ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ. 16 వేల కోట్ల వడ్డీ బదులు 33 శాతం వాటాను ఇచ్చేందుకు బోర్డు నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం జులైలో ఆమోదం తెలిపింది.