Steel Imports: ఉక్కు దిగుమతులపై 25 శాతం వరకు తాత్కాలిక పన్ను విధించే అవకాశం

ఈ తాత్కాలిక పన్ను దాదాపు 25 శాతం వరకు విధించే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-12-17 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఉక్కు దిగుమతులపై 'రక్షణ సుంకం' లేదా తాత్కాలిక పన్ను' విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులను అరికట్టేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుందని ఆశిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ తాత్కాలిక పన్ను దాదాపు 25 శాతం వరకు విధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న పరిశ్రమలపై అధిక ఉక్కు ధరల ప్రభావం ఉండదని హామీ లభించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభించింది. దీనిపై తగిన సమీక్ష జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుందని, చిన్న తయారీదారుల ఆందోళనను పరిష్కరించి, బడా ఉక్కు తయారీదారులు తక్కువ ధరకు ఉక్కు సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకోవచ్చని పరిశ్రమలకు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రస్తుతం చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులు దేశీయ ఉక్కు తయారీదారులకు హాని కలిగిస్తున్నాయా లేదా అనే దానిపై భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ దర్యాప్తు చేస్తోంది. ఇది ముగిసిన తర్వాత ప్రభుత్వం తాత్కాలిక పన్ను విధించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News