స్టార్టప్‌లకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించే పనిలో కేంద్రం

బైజూస్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, భారత్‌పే లాంటి స్టార్టప్‌ల నియంత్రణ పరమైన సమస్యల పరిష్కారానికి పరిశీలిస్తోంది.

Update: 2024-02-26 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల స్టార్టప్ కంపెనీలు నియంత్రణా పరమైన లోపాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బైజూస్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, భారత్‌పే లాంటి స్టార్టప్‌లు నియంత్రణ పరమైన సమస్యలను చూస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వీటి పరిష్కారానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా పరిస్థితులను పరిశీలిస్తోంది. ప్రభుత్వం నియమించిన కంపెనీ లా కమిటీ గత నెలలో సమావేశమైంది. ప్రధానంగా బడా అన్‌లిస్టెడ్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసేందుకు త్వరలో మళ్లీ సమావేశం కానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బైజూస్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లాంటి ప్రధాన స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న రెగ్యులేటరీ, కార్పొరేట్ పాలన సవాళ్ల మధ్య మొత్తం స్టార్టప్ రంగం వృద్ధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకున్నట్టు సమాచారం. ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), సెబీ పరిధిలో లేని కంపెనీలను నేరుగా పర్యవేక్షిస్తుంది.

'బైజూస్‌కు సంబంధించి కొనసాగుతున్న తనిఖీలను గమనిస్తున్నాం. నివేదికను రూపొందించే పనిని వేగవంతం చేస్తున్నాం. ఇక, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలోనూ ఆర్‌బీఐని సంప్రదించిన తర్వాత దర్యాప్తు చేస్తామని ' ఓ అధికారి చెప్పారు. ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం స్టేటస్ రిపోర్ట్‌లో కనుగొన్న విషయాలపై వివరాలను కోరుతూ ఇటీవల భారత్‌పేకి నోటీసులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. మితిమీరిన నియంత్రణ భారం లేకుండా పెట్టుబడిదారులు, బోర్డు డైరెక్టర్ల నియమ, నిబంధనల ద్వారా నియంత్రించే అవకాశాలను కమిటీ అంచనా వేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News