ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ- వీలర్ల కోసం అదిరిపోయే కొత్త స్కీమ్
దేశవ్యాప్తంగా టూ వీలర్, త్రీ- వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మార్చి 13న కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024ని ప్రకటించింది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టూ వీలర్, త్రీ- వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మార్చి 13న కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024ని ప్రకటించింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి మొదలై నాలుగు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని, దేశంలో ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండే పథకాన్ని ప్రారంభించిన అనంతరం అన్నారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ- వీలర్ వాహనాలు, ఈ-రిక్షాల విక్రయాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఈ పథకంలో సుమారు 3.3 లక్షల ఈవీ టూ-వీలర్లకు మద్దతు అందించడంతో పాటు ప్రతి టూ-వీలర్‌కు రూ.10,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే, 31,000 కంటే ఎక్కువ త్రీ- వీలర్ వాహనాల కొనుగోలుపై రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అదే పెద్ద త్రీ-వీలర్ కొనుగోలు కోసం రూ. 50,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు. ఫేమ్ పథకం రెండో దశ కింద సబ్సిడీలు, మార్చి 31, 2024 వరకు లేదా నిధులు అందుబాటులో ఉండే వరకు విక్రయించిన ఈవీ వాహనాలు అర్హత కలిగి ఉంటాయి.