ఉక్కు ఉత్పత్తిలో బయోచార్ వినియోగానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

దేశంలో ఉక్కు పరిశ్రమలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉక్కు ఉత్పత్తిలో బయోచార్ వినియోగాన్ని అన్వేషించడానికి ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు

Update: 2024-03-31 08:08 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఉక్కు పరిశ్రమలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉక్కు ఉత్పత్తిలో బయోచార్ వినియోగాన్ని అన్వేషించడానికి ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బయోచార్ అనేది వ్యవసాయ వ్యర్ధ ఉత్పత్తుల వంటి బయోమాస్ మూలాల నుండి ఉత్పత్తి చేయబడిన బ్లాక్ కార్బన్. దీనిని ఉక్కు తయారీలో వాడటం ద్వారా ఈ పరిశ్రమ నుంచి కర్బన ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం ప్రతిపాదన. అధికారిక సమాచారం ప్రకారం, దేశీయ ఉక్కు రంగం భారతదేశ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 12 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని మరింత తగ్గించాలని ప్రభుత్వం చూస్తుంది.

గతంలో మార్చి 2023లో, కేంద్ర ఉక్కు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గ్రీన్ స్టీల్ ఉత్పత్తికి సంబంధించిన ముడి పదార్థాలు, సాంకేతికత, పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించడానికి 13 టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేశారు. బయోచార్ వాడకం ద్వారా దేశీయ ఉక్కు పరిశ్రమలో కార్బన్ తగ్గింపుకు మరింత సహాయం చేయడానికి 14వ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి బయోచార్ ముఖ్యమైన లివర్‌గా ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించారు.


Similar News