కొత్త జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు!
బంగారం ధరలు మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి.
హైదరాబాద్: బంగారం ధరలు మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు కొత్త జీవితకాల గరిష్ఠానికి చేరాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం గురువారం రూ. 540 పెరిగి రూ. 62,180కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 500 పెరిగి రూ. 57,000కు పెరిగింది. వెండి కూడా కిలో రూ. వెయ్యి పెరిగి రూ. 82,800కి చేరింది. బుధవారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీనపడింది.
ఆ ప్రభావంతో గురువారం అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడులు ఊపందుకున్నాయి. దేశీయంగానూ అవే పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే కొద్దీ పసిడి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 2081.80 డాలర్లతో కొత్త గరిష్ఠాలను తాకింది. గురువారం సాయంత్రానికి స్పాట్ మార్కెట్లో ఔన్స్ 2040 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు ధర 25.28 డాలర్ల వద్ద ఉంది. దేశీయంగా ఇతర ప్రధాన మార్కెట్లలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 62,330, ముంబైలో రూ. 62,180, చెన్నైలో రూ. 62,730, బెంగళూరులో రూ. 62,230, కోల్‌కతా, పూణెలలో రూ. 62,180గా ఉంది.