మళ్లీ ఆసియా అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
గత కొంతకాలంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించడంతో గౌతమ్ అదానీ సంపద పెరిగింది.
దిశ, బిజినెస్ బ్యూరో: బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ టాప్‌కి చేరారు. గత కొంతకాలంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించడంతో గౌతమ్ అదానీ సంపద పెరిగింది. దాంతో అదానీ సంపద 111 బిలియన్ డాలర్లతో ప్రపంచ సమంపన్నుల జాబితాలో 11వ స్థానానికి చేరారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది. అదాని తర్వాత ముఖేష్ అంబానీ 109 బిలియన్ డాలర్లతో 12వ స్థానంలో ఉన్నారు. ఇటీవల అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అదానీ కంపెనీల షేర్లకు సానుకూల రేటింగ్ ఇచ్చింది. ఈ కారణంతో గతవారం అదానీ షేర్లు గరిష్ఠంగా 14 శాతం వరకు పుంజుకున్నాయి. దానివల్ల కంపెనీ సంపద రూ. 84 వేల కోట్లకు పైగా పెరిగి, అదానీ గ్రూప్‌లో ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 17.51 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదివరకు 2022లో గౌతమ్ అదానీ ఆసియా అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. 2023, జనవరిలో అమెరికా హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల గ్రూప్ సంపద సగానికి పైగా క్షీణించింది. ఆ తర్వాత కంపెనీ తీసుకున్న దిద్దుబాటు చర్యలతో తిరిగి నెమ్మదిగా సంపద పెరిగింది.