భారత జీడీపీ వృద్ధి అంచనాలు పెంచిన ఫిచ్ రేటింగ్స్

భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సవరించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.

Update: 2024-03-14 07:36 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సవరించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. అలాగే, మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.8 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. దేశం క్రమంగా బలమైన ఆర్థిక విస్తరణను కొనసాగించడం, పెట్టుబడులు కూడా పుంజుకోవడం, ప్రపంచ దేశాలతో పోలిస్తే పరిశ్రమల వృద్ధికి సానుకూల అంశాలు ఉండటం కారణంగా జీడీపీ వృద్ధి వరుసగా మూడు త్రైమాసికాల్లో 8 శాతానికి మించి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి ఊపందుకోవడంలో సడలింపు ఉండే అవకాశం ఉందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది.

అలాగే, జులై నుండి డిసెంబర్ 2024 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 bps వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ భావిస్తోంది. ఈ ఏడాది నాటికి భారత సీపీఐ ద్రవ్యోల్బణం క్రమంగా 4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. భారత ప్రభుత్వం ఇటీవలే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను గతంలో 7.3 శాతం నుండి 7.6 శాతానికి పెంచింది.

ఫిచ్ రేటింగ్స్ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆందోళనల మధ్య 2024లో చైనా జీడీపీ వృద్ధిని 4.6 శాతం నుండి 4.5 శాతానికి తగ్గించగా, అక్కడి అధికారులు తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా చైనా వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ఏజెన్సీ అంచనా వేసింది. వృద్ధి అవకాశాలు మెరుగుపడటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ జీడీపీ వృద్ధిని 0.3 శాతం పాయింట్ల నుండి 2.4 శాతానికి ఫిచ్ రేటింగ్స్ పెంచింది.


Similar News