COAL : దేశంలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి.. 5.85 శాతం వృద్ధి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది.

Update: 2024-09-14 15:10 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 12, 2024 నాటికి, దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా 411.62 మిలియన్ టన్నులకు (MT) చేరుకుంది, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఉత్పత్తి 388.86 మి.టన్నులు కాగా ఇప్పుడు 5.85 శాతం వృద్ధిని సాధించడం గమనార్హం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మైనింగ్ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు వచ్చినప్పటికి వాటన్నింటిని అధిగమించి ఉత్పత్తి పెరిగిందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు.

ముఖ్యంగా ఈ రంగంలో కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ఈ వృద్ధికి కీలకంగా ఉంది. దీని ఉత్పత్తి గత సంవత్సరం 302.53 మి.టన్నుల నుండి 2.80 శాతం పెరిగి ప్రస్తుతం 311 మి.టన్నులకు చేరుకుంది. మొత్తంగా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు, దాని పంపిణీ కూడా మెరుగ్గా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. బొగ్గు నిల్వలు కూడా గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్ 12 నాటికి, బొగ్గు కంపెనీలు నిల్వ చేసిన బొగ్గు 76.49 మి.టన్నులకు పెరిగింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 49.07 శాతం వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, దేశీయ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లు 36.58 మి.టన్నుల బొగ్గు నిల్వలను నివేదించాయి, ఇది 43.68 శాతం ఆకర్షణీయమైన వృద్ధి.


Similar News