ఎన్నికలకు ముందు అప్రమత్తంగా FPIలు.. ఈక్విటీల నుంచి రూ.325 కోట్లు విత్‌డ్రా
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి FPIలు రూ. 325 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చి నెలలో రూ. 35,000 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల పెట్టుబడులు వచ్చిన తర్వాత ఈ నెల నికర ప్రవాహం పట్ల విదేశీ మదుపరులు జాగ్రత్తగా ఉన్నారని డిపాజిటరీల డేటా వెల్లడించింది. సమీక్ష కాలంలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్‌లో రూ.1,215 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి.
JP మోర్గాన్ ఇండెక్స్‌లో రాబోయే భారత ప్రభుత్వ బాండ్‌లను చేర్చడం ద్వారా FPIలు గత కొన్ని నెలలుగా డెట్ మార్కెట్‌లలోకి ఎక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే దీని ద్వారా భారత్‌కు భారీ ప్రయోజనాలు చేకూరుతాయని 20-40 బిలియన డాలర్ల పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేశారు. ఈ సంవత్సరం మొత్తం ఇన్‌ఫ్లో ఇప్పటివరకు ఈక్విటీలలో రూ.10,500 కోట్లకు పైగా, డెట్ మార్కెట్‌లో రూ.57,000 కోట్లకు పైగా ఉంది.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మాట్లాడుతూ, రానున్న కాలంలో భారత్‌లోకి వచ్చే ఎఫ్‌పీఐలపై అమెరికా బాండ్ రేట్లు ప్రభావం చూపిస్తాయని అన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గా, స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నందున అధిక US బాండ్ రాబడులు ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐ విక్రయాలు పరిమితం చేయబడతాయని ఆయన తెలిపారు.