FPI: ఆగస్టులో రూ.7 వేల కోట్లకు పడిపోయిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు
గత కొద్ది నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు భారీగా రాగా, ఆగస్టు నెలలో మాత్రం తక్కువ స్థాయిలో ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు జరిపినట్లు డిపాజిటరీల డేటా చూపించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్ది నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు భారీగా రాగా, ఆగస్టు నెలలో మాత్రం తక్కువ స్థాయిలో ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు జరిపినట్లు డిపాజిటరీల డేటా చూపించింది. డేటా ప్రకారం, ఆగస్టు నెలలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 7,320 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత వారు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెట్టుబడులు తక్కువగా వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు జులైలో రూ. 32,365 కోట్లు, జూన్‌లో రూ. 26,565 కోట్లు రాగా, సమీక్ష నెలలో భారీగా తగ్గడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆగస్టులో డెట్(రుణ) మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.17,960 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.
జేపీ మోర్గాన్ ఇండెక్స్ బాండ్ సూచీలలో భారత బాండ్లను చేర్చడం, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఈక్విటీల నుండి మార్పు, అనుకూలమైన దీర్ఘకాలిక దృక్పథం కారణంగా ఎఫ్‌పీఐలు రుణంలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా 2024లో ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.42,885 కోట్లు, డెట్ మార్కెట్‌లో రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సూచికలు, ప్రపంచ వడ్డీ రేటు కదలికలు, మార్కెట్ విలువలు, రంగాల ప్రాధాన్యతలు పెరగడం కారణంగా సెప్టెంబరులో ఎఫ్‌పీఐల నుండి మరింత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.