'భారత్ ఏటా 8-9 శాతం వృద్ధి సాధిస్తేనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ సాధ్యం'!
అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ప్రస్తుత కఠిన పాలసీ నిర్ణయాలను కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
ముంబై: అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ప్రస్తుత కఠిన పాలసీ నిర్ణయాలను కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి రంగరాజన్ అభిప్రాయపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదిగేందుకు భారత్ రాబోయే ఐదేళ్లలో 8-9 శాతం వార్షిక వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 7 శాతానికి చేరితే పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు భావించవచ్చని, ఆర్‌బీఐ ప్రస్తుతం పాలసీ వైఖరిని కొనసాగించాలని రంగరాజన్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
రానున్న రోజుల్లో మరింత పెంపు ఉంటుందని భావిస్తున్నాను. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ ఇప్పుడు అనుసరిస్తున్న దానికంటే దూకుడుగా ఉండాలన్నారు. అలాగే, మూలధన ప్రవాహం తగ్గడం వల్ల అమెరికా డాలరుతో రూపాయి విలువ రూ. 79-80కి పడిపోయింది. దీన్ని పెంచడం ద్వారా రూపాయి బలపడే అవకాశం ఉంది. అయితే, కరోనా ముందుస్థాయికి చేరుకునే అవకాశం లేదన్నారు. విద్యుత్, వ్యవసాయ మార్కెటింగ్ వంటి వివిధ రంగాల్లో సంస్కరణలు తప్పనిసరిగా కొనసాగాలని, 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు సమన్వయంతో కూడినవని రంగరాజన్ అన్నారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.