భారత సావరిన్ బాండ్లలోకి రూ.82 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు
ప్రభుత్వం జారీ చేసే భారత సావరిన్ బాండ్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడులు రూ.82 వేల కోట్లు($10 బిలియన్లు)కు చేరుకుంటున్నట్లు ఒక డేటా పేర్కొంది
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వం జారీ చేసే భారత సావరిన్ బాండ్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడులు రూ.82 వేల కోట్ల($10 బిలియన్లు)కు చేరుకుంటున్నట్లు ఒక డేటా పేర్కొంది. గ్లోబల్ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ కీలక ఇండెక్స్‌లలో ఒకటైన ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌లో ప్రభుత్వ బాండ్లు చేరనున్న నేపథ్యంలో ఇండియా బాండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డేటా ప్రకారం, జేపీ మోర్గాన్‌లో భారత బాండ్లు చేరతాయనే ప్రకటన సెప్టెంబర్‌లో రాగా, అప్పటి నుంచి క్రమంగా బాండ్లలోకి ఇన్‌ఫ్లోలు పెరిగాయి.
ముఖ్యంగా 2026- 2030 మధ్య మెచ్యూర్ అయ్యే చిన్న బాండ్‌లలో పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోళ్లను జరిపారు. జేపీ మోర్గాన్ నిర్ణయంతో 2025, మార్చి నాటికి దాదాపు రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు భారత మార్కెట్లోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చే ఏడాది నుండి దాని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లోకల్ కరెన్సీ ఇండెక్స్‌లో కొన్ని భారత బాండ్లను కూడా చేర్చనుంది.