జొమాటోకు 'పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్' ఇచ్చిన ఆర్‌బీఐ
జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను సులభతరం చేయడానికి వీలవుతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కంపెనీ గురువారం ప్రకటించింది. జొమాటో అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ఆర్‌బీఐ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ తీసుకున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను సులభతరం చేయడానికి వీలవుతుంది. ఏదైనా కంపెనీ డిజిటల్ చెల్లింపులు నిర్వహించాలంటే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్‌తోనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్స్, మర్చంట్ల నుంచి లావాదేవీలు చేసేందుకు వీలవుతుంది. దీని ద్వారా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం లాంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. మర్చంట్ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు. ఇప్పటికే కంపెనీ 'జొమాటో పే' పేరుతో సొంత యూపీఐ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది.