దశాబ్ద కాలంలో మొదటిసారి క్షీణించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!
బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2022-23లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 16 శాతం తగ్గి దాదాపు రూ. 5.87 లక్షల కోట్లకు పడిపోయాయి.
న్యూఢిల్లీ: బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2022-23లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 16 శాతం తగ్గి దాదాపు రూ. 5.87 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇది గడిచిన దశాబ్ద కాలంలోనే మొదటి క్షీణత అని గణాంకాలు పేర్కొన్నాయి. తాజా ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు రూ. 7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను భారత్‌లో పెట్టారు. ప్రధానంగా అమెరికా, స్విట్జర్లాండ్, మారిషస్‌ల నుంచి పెట్టుబడులు నెమ్మదించడం దీనికి కారణం.
ఇక, తయారీ, కంప్యూటర్, కమ్యూనికేషన్ సర్వీసెస్‌లలో ఎఫ్‌డీఐలు క్షీణించాయి. సమీక్షించిన కాలంలో సెమీకండక్టర్ పరిశ్రమలో అత్యధికంగా రూ. 2.16 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితంగానే పెట్టుబడులు వస్తున్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌లలో ద్రవ్యోల్బణం, బలహీన డిమాండ్ వల్ల దేశీయ స్టార్టప్‌లలో నిధులు తగ్గిపోయాయని గణాంకాలు పేర్కొన్నాయి.