Finance Ministry: గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియను ప్రారంభించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రక్రియ పూర్తయితే గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి చేరే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-11-05 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్ఆర్‌బీ) సామర్థ్యాన్ని పటిష్టం చేయడంతో పాటు ఖర్చులను తగ్గించేందుకు ఆర్ఆర్‌బీలను ప్రభుత్వం విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే మూడు దశలు పూర్తయిన ఈ ప్రక్రియలో నాలుగో దశను నిర్వహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ ప్రక్రియ పూర్తయితే గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి చేరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్‌బీలు విలీనం కానున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 4 గ్రామీణ బ్యాంకులు విలీనమవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీన ప్రక్రియ ఆస్తులు, అప్పులను సర్దుబాటు చేసిన తర్వాతే ఉండనుంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి యూపీ, బెంగాల్‌లలో 3 చొప్పున, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 చొప్పున ఆర్ఆర్‌బీలు విలీనం కానున్నాయి. ఒక రాష్ట్రం, ఒక ఆర్ఆర్‌బీ ద్వారా గ్రామీణ బ్యాంకులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. గ్రామాల్లో ఉండే రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ఆర్ఆర్‌బీ చట్టం-1976 పరిధిలో ఆర్ఆర్‌బీలు ఏర్పాటయ్యాయి. ఇవి సాధారణ బ్యాంకులకు భిన్నంగా పనిచేస్తాయి. ఆర్ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు వాటా ఉంది. మిగిలిన దాంట్లో స్పాన్సర్ బ్యాంకుకు 35 శాతం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటాలు ఉన్నాయి.

Tags:    

Similar News