Fake challan scam: ఈ-చలాన్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు!

టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.

Update: 2023-08-30 16:21 GMT

న్యూఢిల్లీ: టెక్నాలజీ వినియోగం పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలను సైబర్ మోసాలకు బలికాకుండా చూస్తోంది. తాజాగా సైబర్ నేరగాళ్లు ట్రాఫిక్ చలాన్‌ల పేరుతో మోసం చేస్తున్నట్టు ప్రభుత్వం, పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఈ-చలాన్ రూపంలో మెసేజ్‌లను పంపి డబ్బు కొట్టేస్తున్నారని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు సాధారణ ఎస్ఎంఎస్ రూపంలో నకిలీ ఈ-చలాన్ లింక్‌లను పంపిస్తున్నారు. సదరు నకిలీ లింక్‌లోనే చెల్లింపులు నిర్వహించేలా చేస్తున్నారు. ఎవరైనా నమ్మి లింక్ ద్వారా వివరాలను ఇస్తారో, వారి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.

సాధారణంగా చలాన్ పేరుతో వచ్చే మేసేజ్‌లలో వాహనం నంబర్‌తో పాటు ఇంజిన్, ఛాసిస్ నంబర్ లాంటి వివరాలు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు పంపే ఎస్ఎంఎస్‌లలో అలాంటి వివరాలు ఉండవు. ఇది గమనించకుండా లింక్ క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వం హెచ్చరించాయి. ఒకవేళ ప్రజలు చలాన్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని భావిస్తే అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అనుకోను సందర్భాల్లో సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.


Similar News