2024లో భారతీయ కంపెనీల సగటు జీతాల పెరుగుదల 9.6 శాతం
'ఫ్యూచర్ ఆఫ్ పే-2024' పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, ఈ-కామర్స్ రంగంలో ఈ ఏడాది 10.9 శాతం పెరగనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదిలో వివిధ రంగాల్లో ఉద్యోగుల జీతాలు సగటున 9.6 శాతం పెరగవచ్చని కన్సల్టింగ్ సంస్థ ఈవై తెలిపింది. 2023లోనూ సగటున జీతాల పెరుగుదల ఇదే స్థాయిలో ఉంది. అయితే, అంతకుముందు 2022లో 10.4 శాతంతో పోలిస్తే తగ్గిందని ఈవై బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 'ఫ్యూచర్ ఆఫ్ పే-2024' పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, ఈ-కామర్స్ రంగంలో ఈ ఏడాది 10.9 శాతం పెరగనుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్(10.1 శాతం), ప్రొఫెషనల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్(10 శాతం చొప్పున) ఎక్కువ జీతాల పెంపును ఇవ్వనున్నాయి. ఇక, 2022లో మొత్తం టెక్ రంగాన్ని కంగారు పెట్టిన అట్రిషన్ రేటు క్రమంగా తగ్గుతోందని నివేదిక తెలిపింది. 2022లో 21.2 శాతంగా ఉన్న వలసల రేటు 2023 నాటికి 18.3 శాతానికి చేరింది. ఆసక్తికరంగా గతేడాదితో పోలిస్తే 2024లో కొత్త ఉద్యోగాలు మారేందుకు ఉద్యోగులు విముఖంగా ఉన్నారని ఈవై పేర్కొంది. రానున్న రోజుల్లో దేశీయంగా కంపెనీల్లో అట్రిషన్ రేటు మరింత తగ్గవచ్చని, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత పెరిగిందని నివేదిక వెల్లడించింది.