BSNL: వరుసగా రెండో నెలా పెరిగిన బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు
ఇదే సమయంలో ప్రైవేట్ రంగ దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను పోగొట్టుకున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం రంగంలో కొన్నేళ్ల నుంచి వినియోగదారులను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ రెండు నెలలుగా సత్తా చాటుతోంది. ఆగష్టు నెలకు సంబంధించి వరుసగా రెండో నెల బీఎస్ఎన్ఎల్ భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను పోగొట్టుకున్నాయి. జూలైలో ప్రైవేట్ టెల్కోలు అధికంగా టారిఫ్ ధరలను పెంచడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవడం ప్రారంభించారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం, ఆగష్టులో జియో మొత్తం 40.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ఎయిర్‌టెల్, 24 లక్షలు, వొడాఫోన్ అడియా 18 లక్షల మంది వినియోగదారులను పోగొట్టుకున్నాయి. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ జూలైలో 29 లక్షలు, ఆగష్టులో మరో 25 లక్షల మందిని చేర్చుకుంది. ఈ వారంలోనే బీఎస్ఎన్ఎల్ సమీప భవిష్యత్తులో టారిఫ్ ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో రానున్న నెలల్లోనూ సంస్థ మరింత మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.