ఈపీఎఫ్ఓలో చేరేందుకు జీతం, ఉద్యోగుల సంఖ్య పరిమితి తొలగించే ప్రతిపాదన!
న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులతో పాటు ఉద్యోగులందరినీ కవర్ చేసేందుకు పరిధిని విస్తృతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో ఉన్న నిబంధనలను సవరించాలని, కొత్త నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. కంపెనీల్లోని ఉద్యోగుల జీతం, పరిమితిని రద్దు చేసే ప్రతిపాదనను కూడా ఈపీఎఫ్ఓ పరిశీలిస్తోంది. దీనికోసం వాటాదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈ ప్రతిపాదనలను ఉంచింది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో చేరేందుకు ఒక కంపెనీలో 20 మందికి పైగ ఉద్యోగులు ఉండాలి, వారి జీతం రూ. 15 వేల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ పరిమితిని సవరించేందుకు ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్-1952లో మార్పులు చేయనుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ స్కీమ్ వ్యాపారాలను చేసుకునే వారికి కూడా అందించడానికి వీలవుతుంది. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తే ఉద్యోగుల జీతంతో పాటు వారి సంఖ్య నియమం రద్దవుతుంది. అప్పుడు ఎంత ఆదాయం ఉన్నవారైనా ఈపీఎఫ్ఓ స్కీమ్‌లో చేరవచ్చు. ఇదే సమయంలో ఈపీఎఫ్ఓ జీతం పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచాలనే ప్రతిపాదనను కూడా ఓ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది.