మార్చిలో కీలక రంగాల వృద్ధి 3.6 శాతం!
దేశంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి మార్చిలో 3.6 శాతం నమోదైంది.
న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి మార్చిలో 3.6 శాతం నమోదైంది. ఇది ఐదు నెలల్లోనే అత్యంత నెమ్మదైన వృద్ధి అని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అంతకుముందు ఫిబ్రవరిలో ప్రధాన రంగాల ఉత్పత్తి 7.2 శాతం, గతేడాది మార్చిలో 4.8 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.
శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో చమురు ఉత్పత్తి 2.8 శాతం, విద్యుదుత్పత్తి 1.8 శాతం, సిమెంట్ ఉత్పత్తి 0.8 శాతం క్షీణించాయి. బొగ్గు ఉత్పత్తి 12.2 శాతం, ఎరువులు 9.7 శాతం, సహజ వాయువు 2.8 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 1.5 శాతం వృద్ధి నమోదైంది.
బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్.. ఈ ఎనిమిది మౌలిక రంగాలను కీలక రంగాలుగా వ్యవహరిస్తారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది.