భారత జీడీపీ వృద్ధి అంచనాను తగ్గించిన క్రిసిల్!
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతంగా నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతంగా నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7 శాతం కంటే తగ్గుతుందని వెల్లడించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 2023-24కి సంబంధించి వృద్ధిని 6.4 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. తగ్గుతున్న ఎగుమతులు, వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కారణంగా భారత వృద్ధి కొంత నెమ్మదించవచ్చని క్రిసిల్ అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా మందగిస్తున్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల మధ్య రాబోయే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక సవాలుగా ఉండనుందని క్రిసిల్ పేర్కొంది. రానున్న రెండు నెలలు సైతం ద్రవ్యోల్బణం పెరగవచ్చు. కరోనా మహమ్మారి నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు అనేక సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయి. అందుకనుగుణంగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ఎగుమతులకు అడ్డంకులు పెరిగి డిమాండ్ బలహీనపడవచ్చని క్రిసిల్ వెల్లడించింది.