Telecom Department: 'సంచార్ సాథీ' మొబైల్ యాప్ విడుదల చేసిన టెలికాం విభాగం
టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా పెరుగుతున్న మోసాపూరిత కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు టెలికాం విభాగం రూపొందించిన 'సంచార్ సాథి' మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కాల్ లాగ్ నుంచి నేరుగా సదరు నంబర్‌ను బ్లాక్ చేయడం లేదా దానిపై ఫిర్యాదు చేసే సదుపాయాలను కల్పిస్తుంది. 2023లోనే సంచార్ సాథి వెబ్‌సైట్ తీసుకొచ్చినప్పటికీ, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మొబైల్ యాప్‌ను కూడా టెలికాం విభాగం అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా వెగంగా పెరుగుతున్న సైబర్ మోసగాళ్ల నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లోనూ ఉందని టెలికాం విభాగం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ యాప్ నుంచి స్పామ్ కాల్స్‌ను గుర్తించి ఫిర్యాదు చేయడంతో పాటు నెట్‌వర్క్ సబ్‌స్క్రైబర్ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి, అనధికారికంగా ఎవరైనా కస్టమర్ పేరు మీద నంబర్ వాడుతుంటే దానిపై ఫిర్యాదు చేసే వీలుంటుంది. అలాగే, మొబైల్‌ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనం జరిగితే సిమ్ కార్డును బ్లాక్ చేయవచ్చు.