బడ్జెట్ అంచనాలను మించిపోయిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

భారత్‌లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి

Update: 2024-04-21 09:12 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మార్చి 31, 2024న ముగిసే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏడాది ప్రాతిపదికన దాదాపు 17.7 శాతం వృద్ధి చెంది రూ.19.58 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆదివారం తెలిపింది. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో రూ.16.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొదట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లుగా లెక్కించారు, ఆ తరువాత దానిని సవరించి రూ.19.45 లక్షల కోట్లను అంచనా వేయగా ఇప్పుడు అది దాటిపోయింది. ఇది మంచి ఆర్థిక పురోగమనాన్ని ప్రతిబింబిస్తుందని, వ్యక్తులు, కార్పొరేట్‌ల ఆదాయాలను పెంచుతుందని అధికారులు తెలిపారు.

సీబీడీటీ ప్రకారం, తాత్కాలిక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.48 శాతం వృద్ధితో రూ.23.37 లక్షల కోట్లు కాగా, రీఫండ్ల సర్దుబాటు తర్వాత మొత్తం వసూళ్లు రూ.19.58 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 13.06 శాతం పెరిగి రూ.11.32 లక్షల కోట్లకు, నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 10.26 శాతం పెరిగి రూ. 9.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగం కూడా గణనీయంగా పెరిగింది. పన్ను చెల్లింపుదారుల నుంచి పెరుగుతున్న మద్దతుతో స్థూల వసూళ్లు 24.26 శాతం పెరిగి రూ.12.01 లక్షల కోట్లకు, నికర వసూళ్లు 25.23 శాతం పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సంవత్సరానికి మొత్తం రీఫండ్‌లు రూ.3.79 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతంలో ఇది రూ.3.09 లక్షల కోట్లగా నమోదైంది.


Similar News