49 శాతం పెరిగిన డిజిటల్ రుణాలు
డిజిటల్ రుణాల సంఖ్య 35 శాతం పెరిగి 10 కోట్లకు పైగా చేరాయని ఫేస్ తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ రుణాల గురించి ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వాటి డిమాండ్ మాత్రం గణనీయమైన వేగంతో పెరుగుతోంది. తాజాగా పరిశ్రమల సంఘం ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్(ఫేస్) నివేదిక 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రుణాలు ఏకంగా 49 శాతం పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. అలాగే డిజిటల్ రుణాల సంఖ్య 35 శాతం పెరిగి 10 కోట్లకు పైగా చేరాయని ఫేస్ తెలిపింది. మొత్తం 37 రిజిస్టర్‌డ్ ఫిన్‌టెక్ కంపెనీల నుంచి ఫేస్ సమాచారం సేకరించింది. డిజిటల్ రుణాల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉంది. అటువంటి రుణాల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఫేస్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఫిన్‌టెక్ కంపెనీలు సగటున రూ. 13,418 రుణాన్ని అందించాయి. మొత్తం రూ. 40,322 కోట్ల విలువైన 2.69 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే సమయంలో సగటు డిజిటల్ రుణం రూ. 12,648గా ఉందని పరిశ్రమల సంఘం గణాంకాలు పేర్కొన్నాయి.