విస్తారా విమానాల రద్దు నేపథ్యంలో రంగంలోకి దిగిన DGCA

ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఇటీవల కాలంలో 100కు పైగా విమానాలను రద్దు చేయడం, అలాగే వాటి విమానాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దాని గురించిన వివరణను అందించాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విస్తారాను కోరింది.

Update: 2024-04-02 08:35 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఇటీవల కాలంలో 100కు పైగా విమానాలను రద్దు చేయడం, అలాగే వాటి విమానాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దాని గురించిన వివరణను అందించాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విస్తారాను కోరింది. ఫ్లైట్ క్యాన్సిలేషన్, లేదా ఆలస్యం అయినప్పుడు రీఫండ్‌తో పాటు ప్రయాణీకులకు అందించాల్సిన సౌకర్యాలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని విస్తారాకు ఏవియేషన్ రెగ్యులేటర్ సంస్థ ఏప్రిల్ 2న నోటీసులు జారీ చేసింది.

తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు వివిధ కారణాల వలన విమాన సర్వీసులను తగ్గించుకోనున్నట్లు విస్తారా సోమవారం ప్రకటించింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విమానయాన సంస్థ సోమవారం దాదాపు 50 విమానాలను రద్దు చేయగా చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి. విస్తారా దేశీయ, అంతర్జాతీయంగా కలిపి రోజువారీగా 300 విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం పలు కారణాల వల్ల ఇప్పుడు విమానాల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

విస్తారాను ఎయిర్ ఇండియాలో టాటా గ్రూప్ విలీనం చేస్తుంది. ఈ నేపథ్యంలో వేతన కోత జరిగే అవకాశం ఉందని పైలట్‌లు, సిబ్బంది అసంతృప్తిగా ఉండగా, గత కొన్ని వారాలుగా అనారోగ్య కారణాలు పేర్కొంటూ మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణికులు విస్తారా విమానాల ఆలస్యం, రద్దు గురించి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో DGCA రంగంలోకి దిగి దీనిపై ఎయిర్‌లైన్స్‌ను వివరణ కోరింది.


Similar News