కార్పొరేట్ రంగంలో రుణాల కోసం డిమాండ్ పెరుగుతోంది: ఎస్‌బీఐ చీఫ్ దినేష్ ఖరా

కార్పొరేట్ రంగం నుంచి రుణాల కోసం డిమాండ్ పెరుగుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఒక మీడియాతో అన్నారు.

Update: 2024-06-13 10:38 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ రంగం నుంచి రుణాల కోసం డిమాండ్ పెరుగుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఒక మీడియాతో అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మారాయి. కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్‌లో తగినంత నగదు మిగులును కలిగి ఉన్నప్పుడు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, తమ కంపెనీ సామర్థ్య విస్తరణకు నిధులు సమకూర్చడానికి రుణాల కోసం వెతకడం ప్రారంభిస్తున్నాయి. వారి అవసరాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా రూ.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఈ వరుసలో ఉన్నాయని దినేష్ ఖరా చెప్పారు.

వీటన్నింటిని చూస్తే, ప్రైవేటు రంగంలో మరిన్ని అవకాశాలు ఉండబోతున్నాయని, ఈ రంగానికి విలువను సృష్టించే స్థితిలో ఎస్‌బీఐ ఉంటుందని ఆయన అన్నారు. రిటైల్ అగ్రికల్చర్, MSME (RAM) రుణాలకు సంబంధించి, అధిక వడ్డీ రేటు ఉన్నప్పటికీ కూడా SBI ఈ సంవత్సరంలో రుణ పుస్తకంలో 16 శాతం వృద్ధిని నమోదు చేయగలదని, పూచీకత్తు కోసం అసెస్‌మెంట్ చేస్తున్నప్పుడు, రుణగ్రహీతలు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉందని తెలుసుకున్నామని తెలిపారు. హౌసింగ్, వెహికల్ లోన్‌లపై ఎలాంటి ఒత్తిడి లేదని ఖరా పేర్కొంటూ, మొత్తం రిటైల్ పోర్ట్‌ఫోలియోలో స్థూల ఎన్‌పీఏ 0.7 శాతంగా ఉందని అన్నారు.


Similar News