బ్యాటరీ ఈవీ విభాగంలోకి అడుగుపెడుతున్న దైమ్లర్ ఇండియా
వచ్చే 6-12 నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ లైట్ డ్యూటీ ట్రక్ ఈసెంటర్ వాహనాన్ని విడుదల చేస్తామని, సీఈఓ సత్యకం ఆర్య తెలిపారు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ దైమ్లర్ ఇండియా ఈవీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. అందులో భాగంగా వచ్చే 6-12 నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ లైట్ డ్యూటీ ట్రక్ ఈసెంటర్ వాహనాన్ని విడుదల చేస్తామని, తద్వారా దేశీయ బ్యాటరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించనున్నట్టు దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ సీఈఓ, ఎండీ సత్యకం ఆర్య బుధవారం ప్రకటనలో తెలిపారు. అయితే, ఈవీ విభాగంలో ప్రవేశించినప్పటికీ సాంప్రదాయ డీజీల్, కార్బన్ డయాక్సైడ్ న్యూట్రల్ ప్రొపల్షన్ టెక్నాలజీలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో డీకార్బనైజ్డ్ రవాణాలో బలమైన పునాదిని కలిగి ఉంటాం. దేశంలో రవాణా వాహనాల విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు లక్ష్యం నిర్దేశించినట్టు సత్యకం ఆర్య వెల్లడించారు.