layoffs: ఇంటెల్‌లో భారీగా లేఆఫ్!.. లిస్ట్‌లో హైదరాబాద్ ఉద్యోగులు..?
సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది
దిశ, బిజినెస్ బ్యూరో: సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల వారు తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, చిప్ మార్కెట్లో అగ్రగామిగా ఉండటానికి ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా తొలగింపులను ప్రకటించలేదు. అయినప్పటికి మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇంటెల్ లేఆఫ్ తీసుకుంటున్నట్లు తెలియడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
భారత్‌లో కూడా తొలగింపుల ప్రభావం ఉండనుంది. కంపెనీ హైదరాబాద్, బెంగుళూరులోని తన క్యాంపస్‌లలో కూడా తొలగింపులు చేపట్టే అవకాశం ఉంది. ఈ కేంద్రాలలో 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఇంటెల్‌కు మార్కెట్లో గట్టి పోటీ మొదలైంది. అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజ్‌ల వంటి కంపెనీ ప్రత్యర్థులు ఈ రంగంలో మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నారు. ఎన్విడియా వంటి కంపెనీలు సెమీకండక్టర్‌ల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటెల్ సాంకేతికతను మెరుగుపరచడం, సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా మార్చడం లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ తొలగింపులు జరగనున్నాయి. గతంలో, 2025 నాటికి ఖర్చు తగ్గింపులతో $10 బిలియన్ల వరకు ఆదా అవుతాయని కంపెనీ అంచనా వేస్తూ 2023లో దాని శ్రామిక శక్తిని 5 శాతం తగ్గించింది.