Tourism: టూరిజం అభివృద్ధి కోసం 'క్రూజ్ భారత్ మిషన్'ను ఆవిష్కరించిన కేంద్రం
దేశం నుంచి ఉన్న అన్ని సర్క్యూట్‌లను కలిపేలా టూరిజం అభివృద్ధి చేయడమే ఈ మిషన్ లక్ష్యమని అధికారిక ప్రకటన వెలువడింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం సోమవారం ఐదేళ్ల 'క్రూజ్ భారత్ మిషన్ ' కార్యక్రమాన్ని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. దేశం నుంచి ఉన్న అన్ని సర్క్యూట్‌లను కలిపేలా టూరిజం అభివృద్ధి చేయడమే ఈ మిషన్ లక్ష్యమని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మిషన్‌లో భాగంగా 10 సీ క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్, ఐదు ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సందర్శనకు ఉద్దేశించిన ఓడరేవులు, ప్రయాణీకుల సంఖ్యను రెట్టింపును చేసేందుకు క్రూజ్ భారత్ మిషన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూఏఈ, మాలే, మాల్దీవులు, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి పొరుగు దేశాలతో క్రూజ్ భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.