న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి కేంద్రం జీపీఎఫ్(జనరల్ ప్రావిడెంట్ ఫండ్) వడ్డీ రేట్లను యథాథంగా ఉంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం జీపీఎఫ్ వడ్డీ 7.1 శాతం వద్ద ఉంది. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్య కాలానికి కూడా ఇదే రేటును కొనసాగించింది. జీపీఎఫ్‌తో పాటు లింక్‌డ్ ఫండ్స్ వడ్డీ రేట్లలోనూ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను అనుసరించే జీపీఎఫ్ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.
ఇటీవల పీపీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయని సంగతి తెలిసిందే. గడిచిన మూడేళ్ల నుంచి పీపీఎఫ్ వడ్డీ రేట్లను పెంచడం లేదు. ఐదేళ్ల పోస్టాఫీస్ ఆర్‌డీపై మాత్రమే కేంద్రం వడ్డీ రేటును పెంచింది. ఈ క్రమంలోనే జీపీఎఫ్ వడ్డీ రేట్లు సైతం స్థిరంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. జీపీఎఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగి వేతనం నుంచి కొంత భాగం జీపీఎఫ్‌కు జమవుతుంది. పదవీ విరమణ తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి పొందవచ్చు. జీపీఎఫ్‌పై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది.