EPFO: పెన్షన్ దారులకు భారీ శుభవార్త.. ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్

పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారతదేశంలోని ఏ బ్యాంక్ లేదా బ్రాంచ్ నుండి అయినా పెన్షన్‌లను తీసుకోవడానికి వీలు కల్పించింది.

Update: 2024-09-04 12:08 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారతదేశంలోని ఏ బ్యాంక్ లేదా బ్రాంచ్ నుండి అయినా పెన్షన్‌లను తీసుకోవడానికి వీలు కల్పించింది. దీని ద్వారా 78 లక్షల మంది EPS పెన్షనర్లకు ప్రయోజనం లభిస్తుంది. దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టం (CPPS)ను బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పెన్షనర్లు తమ లొకేషన్‌లను మార్చినప్పుడు లేదా బ్యాంకులను మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను బదిలీ చేయాల్సిన అవసరాన్ని CPPS తొలగిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఇతర చోట్లకు వెళ్లిన వారికి ఇది భారీ ఉపశమనం. జనవరి 1, 2025 నుండి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌కు ఆమోదం తెలపడం EPFO ఆధునికీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం లభించినట్లయిందని అన్నారు. EPFOను మరింత పటిష్టమైన, సాంకేతికతతో కూడిన సంస్థగా మార్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో ఇది కీలకమైన దశ, దాని సభ్యులు, పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.


Similar News