ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించిన కెనరా బ్యాంకు!
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు డిపాజిట్లను పెంచేందుకు తాజాగా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది..Latest Telugu News
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు డిపాజిట్లను పెంచేందుకు తాజాగా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 666 రోజుల కాలవ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) పథకంపై అత్యధికంగా సాధారణ ఖాతాదారులకు 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు తెలిపింది.
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఎఫ్‌డీలకు ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, సాధారణ ఎఫ్‌డీల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య ఎంపిక చేసిన వివిధ కాలవ్యవధులపై వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ ఎఫ్‌డీలపై వడ్డీ 2.90 శాతం నుంచి 5.75 శాతం మధ్య ఉంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది.
రుణ రేట్లు కూడా పెంపు..
అదేవిధంగా గృహ రుణాలతో పాటు వివిధ లోన్‌లపై కెనరా బ్యాంకు వడ్డీరేట్లను సవరించింది. ఇందులో బ్యాంక్ రెపో లింక్‌డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)లను పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 7 నుంచే అమలవుతాయని తెలిపింది. బ్యాంకు వివరాల ప్రకారం, ఆర్ఎల్ఎల్ఆర్ 50 బేసిస్ పాయింట్లు పెరిగి 8.80 శాతానికి చేరుకుంది.
ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే అన్ని కాలవ్యవధులపై 15 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఓవర్‌నైట్, నెల రోజుల కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ రేటు 7.05 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.40 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.80 శాతానికి, ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 7.90 శాతానికి పెంచింది.