Canara Bank: రూ. 3 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సవరించిన కెనరా బ్యాంక్
సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలవుతాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం ఎఫ్‌డీలపై కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలవుతాయని బ్యాంకు పేర్కొంది. తాజాగా బ్యాంకు వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలవుతాయి. సీనియర్ సిటిజన్‌లకు 4-7.90 శాతం వడ్డీ అమలవుతుంది. సాధారణ ఖాతాదారులకు 7-45 రోజుల మధ్య డిపాజిట్లకు 4 శాతం, 46-90 రోజుల మధ్య ఎఫ్‌డీలపై 5.25 శాతం, 91-179 రోజులకు 5.5 శాతం, 180-269 రోజులకు 6.25 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్తోంది. 270 రోజుల నుంచి ఏడాది లోపు కాలానికి 6.25 శాతం, ఏడాది కాలానికి 6.85 శాతం లభిస్తుంది. స్పెషల్ ఎఫ్‌డీగా 444 రోజులకు 7.25 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. 2-3 ఏళ్లకు 7.30 శాతం ఉండగా, గరిష్ఠంగా 3-5 ఏళ్ల కాలానికి 7.40 శాతం వడ్డీ వర్తిస్తుంది. అన్ని కాలాలపై సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.