మూడు సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
మరో 100 రోజుల్లో ఈ మూడు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభం కానున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: టాటాకు చెందిన రెండింటితో పాటు మొత్తం మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు గురువారం కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 100 రోజుల్లో ఈ మూడు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. 2021, డిసెంబర్‌లో కేంద్రం రూ. 76,000 కోట్లతో చిప్‌ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదించింది. 'దేశంలో మొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను టాటా, తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ఇది గుజరాత్‌లోని ధోలేరాలో ఏర్పాటవుతుందని ' కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ప్లాంటులో నెలకు 50,000 వేఫర్‌లు తయారవుతాయని, ఏటా 300 కోట్ల చిప్‌లను తయారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్లాంట్ కోసం ఇరు సంస్థలు రూ. 91,000 కోట్ల పెట్టుబడులు పెడతాయి.
అస్సాంలో ఏర్పాటయ్యే ప్లాంటులో రోజుకు 4.8 కోట్ల చిప్‌లు తయారు కానున్నాయి. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఈ సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. రూ. 27,000 కొట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ ప్లాంటులో స్వదేశీ అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజీంగ్ టెల్నాలజీలు ఫ్లిప్ చిప్, ఐఎస్ఐపీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయి. మూడు యూనిట్లు కలిసి మొత్తం రూ. 1.27 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. టాటాకు చెందిన రెండింటితో పాటు సనంద్‌లో ఏర్పాటయ్యే ప్లాంటులో రూ. 7,600 కోట్ల పెట్టుబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో గుజరాత్‌లోని సనంద్‌లో అమెరికాకు చెందిన చిప్‌మేకర్ మైక్రాన్ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ నిర్మాణం వేగంగా జరుగుతోందని గురువారం ప్రకటనలో కేబినెట్ వెల్లడించింది.