ఇండియా-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం
భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) దేశాల మధ్య ఫిబ్రవరి 13న కుదిరిన ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్‌వర్క్(IGFA) ఒప్పందానికి బుధవారం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) దేశాల మధ్య ఫిబ్రవరి 13న కుదిరిన ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్‌వర్క్(IGFA) ఒప్పందానికి బుధవారం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో భారత్-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) సహాకరం, నిర్వహణపై రెండు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. భారత్-UAE ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు ఓడరేవులు, సముద్ర, లాజిస్టిక్స్ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఐజీఎఫ్‌ఏ లక్ష్యం.
ఇంతకుముందు 2023 సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా భారత్, యునైటెడ్ స్టేట్స్ (US), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్‌లు IMECని స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. రైలు, సముద్ర నెట్‌వర్క్‌లు, పైప్‌లైన్‌లు, కేబుల్‌ల ద్వారా భారత్ నుంచి మధ్యప్రాచ్యం ద్వారా ఐరోపాకు వస్తువులు, డేటాను కనెక్ట్ చేయడం, ఎగమతులు, దిగుమతులు చేయడం IMEC లక్ష్యం. ఇది రెండు కారిడార్‌లలో నిర్మించబడుతుంది. తూర్పు కారిడార్ - భారత్‌ను అరేబియా గల్ఫ్‌కు కలుపుతుంది, ఉత్తర కారిడార్ - గల్ఫ్‌ను ఐరోపాకు కలుపుతుంది.