జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారా ఉద్యోగుల్ని తొలగిస్తున్న బైజూస్!
ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ కనీసం తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ కనీసం తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గింపు కోసం బైజూస్ ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఒక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, కంపెనీ తన ఉద్యోగులకు ఫోన్ కాల్ ద్వారా లేఆఫ్ విషయాన్ని ప్రకటిస్తుంది. పనితీరు మెరుగుదల ప్రణాళికను, ఎలాంటి నోటీసులు అందించకుండా నేరుగా ఉద్యోగులకు ఫోన్‌కాల్ చేసి మిమ్మల్ని తొలగిస్తున్నామని HR ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొంటున్నారు.
ఇటీవల ఒక ఉద్యోగి సెలవులో ఉన్న సమయంలో HR నుంచి కాల్ వచ్చింది. కాల్‌లో ఆ వ్యక్తిని తొలగించడానికి కంపెనీ నిర్ణయించిందని ఉన్నతాధికారి పేర్కొనగా, తన తొలగింపుకు కారణాన్ని ఉద్యోగి అడిగినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితిని ఉదహరించారు. దీంతో షాక్‌కు గురైన ఉద్యోగి ఆ కాల్‌ను రికార్డ్‌ను చేయడం ప్రారంభించినప్పుడు వెంటనే సదరు HR అనుమతి లేకుండా ఎందుకు అలా చేస్తున్నారంటూ వాదించి వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తరువాత తిరిగి కాల్ చేయగా హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్‌ను బ్లాక్ చేశారని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. ఇలాంటి అనుభవం చాలా మంది ఉద్యోగులకు జరిగినట్లు సమాచారం.
కొన్ని నివేదికల ప్రకారం, ఈ రౌండ్‌లో తొలగింపుల సంఖ్య 100-500 మధ్య ఉండవచ్చు. గత రెండేళ్లలో, బైజూస్ సంస్థ నిధులు తగ్గిపోవడంతో కనీసం 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఖర్చు తగ్గింపులో భాగంగా బైజూస్ ఇప్పటివరకు దాని 292 ట్యూషన్ సెంటర్లలో 30 మూసివేసింది. తమ కార్యకలాపాల ద్వారా మూడో సంవత్సరంలో చాలా కేంద్రాలను లాభదాయకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ గతంలో తెలిపింది.