దేశవ్యాప్తంగా ఆఫీసులను మూసేస్తున్న బైజూస్
దేశవ్యాప్తంగా 300 బైజూస్ ట్యూషన్ సెంటర్లలో పనిచేస్తున్న వారిని మినహాయించి, ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ దేశవ్యాప్తంగా తన కార్యాలయాలన్నింటిని మూసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బెంగళూరులోని నాలెడ్జ్ పార్క్‌లో ఉన్న ప్రధాన కార్యాలయం మినహా అన్ని ఆఫీసులను వదులుకుందని మనీకంట్రోల్ సోమవారం కథనంలో పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా దాదాపు 300 బైజూస్ ట్యూషన్ సెంటర్లలో పనిచేస్తున్న వారిని మినహాయించి, ఉద్యోగులందరికీ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసింది. నిధుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన 200 మిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల వినియోగంపై వివాదం నేపథ్యంలో సంస్థకు కొత్త చిక్కులు వచ్చాయి. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసేయాలనే నిర్ణయం బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగమని కంపెనీలోని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ గత ఆరు నెలల నుంచి జరుగుతోంది. ఒక్కో ఆఫీస్ లీజు గడువు ముగిసిన వెంటనే కంపెనీ మూసేస్తోందని వారు తెలిపారు. ఇటీవలే బైజూస్ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉద్యోగులందరికీ వేతనాల్లో కొంత భాగాన్ని ఇచ్చినట్టు ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించుకునే అవకాశం రాగానే మిగిలిన మొత్తం చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు.