రూ. 436 లతో రూ. 2 లక్షల బీమా ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలో బీమా కవరేజీని అందించడానికి ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)(PMJJBY) పథకాన్ని తీసుకొచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలో బీమా కవరేజీని అందించడానికి ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)(PMJJBY) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. ఏడాదికి రూ. 436 చెల్లించడం ద్వారా ఈ కవరేజీని సొంతం చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. దీనిలో చేరిన వారు బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా ఆటో డెబిట్ ఫెసిలిటీ ఎంచుకోవాలి. దీని ద్వారా ప్రతి ఏటా అదే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ ఆటో డెబిట్ టైంలో ఖాతాలో తగినంత డబ్బులు లేకపోతే పాలసీ రద్దు అవుతుంది.
ఈ పథకంలో ఏదైనా కారణం చేత బీమా తీసుకున్న వారు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల వరకు అందిస్తారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. పాలసీ దారుడు 55 ఏళ్లకు చేరినప్పుడు బీమా రద్దు అవుతుంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారు పూర్తి వివరాల కోసం దగ్గరలోని బ్యాంక్/పోస్టాఫీసులో సంప్రదించగలరు.