న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ఆందోళనల నేపథ్యంలో షిఫ్ట్ ల వారీగా సభలను నిర్వహించనున్నారు. ముందుగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత సమావేశాలు సోమవారం నుంచి వచ్చే నెల 11 వరకు జరగనుండగా, రెండో విడత సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. రాజ్యసభ జీరో అవర్‌ను 30 నిమిషాలకు కుదించింది. ఈ బడ్జెట్ సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం సాయంత్రం 5 గంటలకు పార్టీలు, గ్రూపుల నేతలతో వర్చువల్ సమావేశానికి పిలుపునిచ్చారు.