మార్కెట్ల పతనంతో రూ. 13.5 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి.

Update: 2024-03-13 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో సూచీలు రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. మిడ్-సెషన్ తర్వాత సెన్సెక్స్ ఓ దశలో 1100 పాయింట్లకు పైగా కుదేలైంది. నిఫ్టీ సైతం 22 వేల పాయింట్ల దిగువకు క్షీణించింది. ప్రధానంగా సెబీ ఛైర్‌పర్సన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. స్టాక్ మార్కెట్లలో పలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతున్నాయి. ఇది ఎంతమాత్రం సహేతుకంగా కనిపించట్లేదని మాదవి పురి చెప్పారు. దీంతో అలాంటి స్టాక్స్‌లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. అలాగే, ఇటీవల మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా భారీ నష్టాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా నమోదవడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఇచ్చాయి.

వీటికి తోడు దేశీయంగా కీలక రిలయన్స్, ఎల్అండ్‌టీ, కొన్ని టాటా గ్రూప్ పేర్లు మార్కెట్ సెంటిమెంట్‌లను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 906.07 పాయింట్లు పతనమై 72,761 వద్ద, నిఫ్టీ 338 పాయింట్లు క్షీణించి 21,997 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్, రియల్టీ రంగాలు ఏకంగా 5 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్ని నష్టపోయాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ 3-8 శాతం నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.84 వద్ద ఉంది.

మార్కెట్ల భారీ పతనంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం ఒక్కరోజే రూ. 13.57 లక్షల కోట్లను కోల్పోయి రూ. 371.69 లక్షల కోట్లకు చేరుకుంది. 

Tags:    

Similar News