వచ్చే ఏడాది కార్యాలయాల అద్దె పెరుగుదల బెంగళూరులోనే అత్యధికం!
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికంగా బెంగళూరులో కార్యాలయాల అద్దెలు 5-7 శాతం పెరుగుతాయని ఓ నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికంగా బెంగళూరులో కార్యాలయాల అద్దెలు 5-7 శాతం పెరుగుతాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా 'ఆసియా పసిఫిక్ ఔట్‌లుక్-2023' పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం, కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణ, ఆదా చేసేందుకు చూస్తున్నందున ఈ ప్రాంతంలో వచ్చే ఏడాది కార్యాలయాల అద్దె పెరుగుదల మధ్యస్తంగా ఉంటుంది. దేశీయ ఆఫీస్ మార్కెట్ పనితీరు ప్రస్తుత ఏడాదిలో కనిపించిన ధోరణిలోనే 2023లో కూడా కొనసాగవచ్చని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
నివేదిక పరిశీలించిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 24 నగరాల్లో అత్యధికంగా బెంగళూరులో కార్యాలయాల అద్దె 5-7 శాతం పెరుగుతుందని అంచనా. భారత్ నుంచి ముంబై, న్యూఢిల్లీ నగరాలను కూడా నివేదిక పరిశీలించింది. న్యూఢిల్లీలో కార్యాలయాల అద్దె 4-6 శాతం పెరుగుతుందని భావిస్తుండగా, ముంబైలో 3-5 శాతం పెరుగుదలను నివేదిక అంచనా వేసింది. గృహ విభాగంలో వచ్చే ఏడాది బెంగళూరులో నివాసాల ధరలు 5 శాతం, ముంబైలో 4 శాతం, న్యూఢిల్లీలో 2-3 శాతం పెరుగుతాయని నివేదిక పేర్కొంది.