కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఎన్నికల ఎఫెక్ట్!
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ అటకెక్కనున్నట్టు తెలుస్తోంది
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ అటకెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న దశలో ఉన్న వాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించాం. కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికలు వెనుకబడ్డాయి. కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని సరైన సమయానికి పూర్తవుతాయని అధికారి చెప్పారు.
2021 ఏడాది కేంద్ర బడ్జెట్ తర్వాత నీతి ఆయోగ్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం(దీపమ్)కు సిఫార్సు చేసింది. అందులో భాగంగానే దీపమ్ 2024, మార్చి 31 నాటికి ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ఆర్థిక బిడ్లను కోరవచ్చని, ఈ ప్రక్రియ మరికొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని అధికారి వెల్లడించారు.