అత్యధిక టర్నోవర్‌ను సాధించిన దేశీయ వాహన కాంపొనెంట్ పరిశ్రమ!

గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆటో కాంపొనెంట్ పరిశ్రమ అత్యధిక టర్నోవర్‌ను నమోదు చేసింది.

Update: 2023-08-07 14:43 GMT

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆటో కాంపొనెంట్ పరిశ్రమ అత్యధిక టర్నోవర్‌ను నమోదు చేసింది. డిమాండ్ బలంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండంకెల అమ్మకాల వృద్ధిని ఆశిస్తున్నట్టు ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యూఫక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ) అభిప్రాయపడింది. ఏసీఎంఏ ప్రకారం, ఆటో కాంపొనెంట్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5.6 లక్షల కోట్ల టర్నోవర్‌ను వెల్లడించగా, అంతకుముందు 2021-22లో నమోదైన రూ. 4.2 లక్షల కోట్ల కంటే 33 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అలాగే, సమీక్షించిన కాలంలో ఎగుమతులు 5 శాతం పెరిగి రూ. 1.61 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులు 11 శాతం పెరిగి రూ. 1.63 లక్షల కోట్లుగా నమోదైనట్టు ఏసీఎంఏ వెల్లడించింది. అదేవిధంగా దేశీయ మార్కెట్లో ఒరిజినల్ తయారీదారులకు విడి పరికరాల అమ్మకాలు 39.5 శాతం పెరిగి రూ. 4.76 లక్షల కోట్లకు చేరుకునాయని పేర్కొంది. సెమీకండక్టర్ల లభ్యత, ఇన్‌పుట్ ఖర్చులు, లాజిస్టిక్స్ సరఫరా తగ్గింపు వంటి పరిణామాల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సర్మ్ దేశీయ వాహన పరిశ్రమ మెరుగైన పనితీరును కొనసాగిస్తుందని ఏసీఎంఏ అధ్యక్షుడు సంజయ్ కపూర్ అన్నారు.


Similar News