అన్ని మోడళ్లపై 2.4 శాతం ధరలు పెంచిన Audi India!
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన మొత్తం అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది..Latest Telugu News
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన మొత్తం అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెల నుంచి అన్ని కార్లపై 2.4 శాతం వరకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. వాహనాల తయారీ కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులతో పాటు సరఫరా వ్యయం భారం కావడం వల్లనే ధరలు పెంచామని, ఇవి సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
గత కొన్ని నెలలుగా విడి పరికరాల ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా కార్యకలాపాలను నిర్వహించామని, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలకు, సరఫరా ఖర్చులు అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ అన్నారు.
ఆడి ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోట్ బ్యాక్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ క్యూ8 మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే, ఎలక్ట్రిక్ విభాగంలో ఈ-ట్రాన్ బ్రాండ్ కింద ఈ-ట్రాన్ 50, ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ మోడళ్లను కలిగి ఉంది.