13 ఏళ్ల గరిష్ఠానికి భారత సేవల రంగ కార్యకలాపాలు!
కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో భారత సేవల రంగ కార్యకలాపాలు ఏప్రిల్‌లో దాదాపు 13 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో భారత సేవల రంగ కార్యకలాపాలు ఏప్రిల్‌లో దాదాపు 13 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. బుధవారం విడుదలైన డేటా ప్రకారం, ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సూచీ ఏప్రిల్‌లో 62 పాయింట్లకు పెరిగింది. 2010, జూన్ తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. అంతకుముందు మార్చిలో పీఎంఐ సూచీ 57.8 పాయింట్లుగా నమోదైంది.
ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ సేవల రంగ కార్యకలాపాలకు డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా ఆర్థిక, బీమా రంగాల్లో కొత్త ఆర్డర్లతో పాటు అంతర్జాతీయ ఆర్డర్లు కూడా భారీగా పుంజుకున్నాయి. వరుసగా మూడో నెలా కొత్త ఎగుమతి వ్యాపారాలు పెరిగాయి. అందుకే సేవల పీఎంఐ రికార్డు దశాబ్దానికి పైగా గరిష్ఠంగా నమోదయ్యాయి.
ఇదే సమయంలో ఇన్‌పుట్ ఖర్చులు గడిచిన మూడు నెలల్లో అత్యధికంగా పెరిగాయి. గిరాకీతో పాటు ఖర్చులు పెరగడంతో ఈ రంగంలోని కంపెనీలు సేవల ధరలను పెంచాయి. అయితే, కొత్త ఉద్యోగాలు మాత్రం స్థిరంగానే ఉన్నాయని ఎస్అండ్‌పీ నివేదిక తెలిపింది. కాగా, పీఎల్ఐ సూచీ సాధారణంగా 50 పాయింట్లకు పైన నమోదైతే వృద్ధిగానూ, 50 కంటే తక్కువ ఉంటే క్షీణత గాను పరిగణిస్తారు.